
హైదరాబాద్,మన జైత్రయాత్ర – డిసెంబర్ 5 :- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన బ్లాక్‌బస్టర్ పుష్ప 2: ది రూల్ విడుదలై నేటికి ఏడాది పూర్తైంది. తెలుగు సినిమా హిస్టరీలోనే అతిపెద్ద హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, విడుదలైన తర్వాత కూడా అంచనాలకు మించి దూసుకెళ్లి రూ.1800 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇప్పుడు ఈ విజయానికి ఏడాది పూర్తైన సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్‌తో అభిమానులను మరలా అలరించాడు.పుష్ప ఫ్రాంచైజీ తన జీవితాన్ని మార్చేసిన ఒక మహాయానమని అల్లు అర్జున్ పేర్కొన్నాడు. ఐదేళ్ల పాటు సాగిన ఈ ప్రస్థానం, తన కళను మరింత లోతుగా అర్థం చేసుకునేలా చేసింది అని చెప్పుకొచ్చాడు. ప్రేక్షకులు చూపిన అపారమైన ప్రేమే ఈ ప్రయాణాన్ని అసాధారణ స్థాయికి తీసుకెళ్లిందని బన్నీ భావోద్వేగంగా రాశాడు.అతను షేర్ చేసిన సందేశంలో, ఈ మాంత్రిక అనుభవాన్ని అందించిన సుకుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ, సహనటులు, సాంకేతిక నిపుణులు, మొత్తం యూనిట్, నిర్మాతలు, పంపిణీదారులు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు. దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచమంతా పుష్ప 2కు వచ్చిన ప్రేమను జీవితాంతం మరిచిపోలేనిదిగా అభివర్ణించాడు.ఇదిలా ఉంటే పుష్ప 2: ది రూల్ తీరు, సాంగ్స్, యాక్షన్, సంభాషణలు, అల్లు అర్జున్ గెటప్, ఫైర్వర్క్స్ కలిపి అభిమానుల్లో నిండుగా నిలిచిపోయిన మరపురాని అనుభూతి ఇచ్చాయి. విడుదలైనా ఏడాది అయినా ఇంకా హైప్ తగ్గకుండా సోషల్ మీడియా, ఫ్యాన్‌బేస్‌లో ఈ చిత్రం దూకుడు కొనసాగుతూనే ఉంది.పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ సృష్టించిన క్రేజ్ ఇప్పటికీ అదే స్థాయిలో ఉండడం చూస్తే, ఈ ఫ్రాంచైజీ ప్రభావం ప్రేక్షకుల హృదయాల్లో ఎంత లోతుగా ఉందో అర్థమవుతోంది.